Blood Circulation Of Animals | Human Blood Circulation | Druvitha Science

Druvitha Science
రక్తప్రసరణ వ్యవస్థ

రక్తం జంతువుల శరీరంలో ప్రవహించే, ద్రవరూపంలో నున్న సంయోజక కణజాలం. ఇది శరీరంలో ముఖ్యమైన ప్రసరణ మాధ్యమంగా పనిచేస్తుంది. రక్తంలో రక్తకణాలు, ద్రవరూపంలో ఉండే బాహ్యమాత్రిక ఉంటాయి. ఇది కొన్ని జంతువులలో నాళాలలోను (సకశేరుకాలు) మరికొన్నిట్లో లిక్విణులు లేదా కోటరాల (Sinuses) వ్యవస్థతోనూ ఉంటుంది. నిమ్న వర్గాల జంతువులలో రక్త కుహర ద్రవం (Haemocoelic fluid) లేదా రక్త కుహరలసిక (Haemolymph) లను రక్తంగా వ్యవహరిస్తారు. ఈ ద్రవం పోషక పదార్థాల, విసర్జక పదార్థాల రవాణాను నిర్వహిస్తుంది. ఆర్థోపొడ, మలస్కాలలో శ్వాసధర్మాన్ని కూడా నిర్వహిస్తుంది. సూడోసీలోమేట్లు (Pseudocoelomates) జలశోషరసాన్ని (Hydrolymph) కలిగి ఉంటాయి. ఇది పోషక, విసర్జక పదార్థాల రవాణాను మాత్రమే నిర్వహిస్తుంది. కానీ శ్వాసక్రియలో ప్రాముఖ్యం లేదు.

రక్తం

రక్తంలో ప్లాస్మా, రక్తకణాలు ఉంటాయి. రక్త కణాలు ద్రవరూప ప్లాస్మాలో తేలుతూ ఉంటాయి. రక్తం ఘన పరిమాణంలో ప్లాస్మా 55 శాతం, రక్త కణాలు 45 శాతం ఉంటాయి.

ప్లాస్మా

దీనిలో 90 శాతం నీరుంటుంది. నీటిలో కరిగి ఉన్న అనేక రకాల పదార్థాలను శరీరంలోని ఒక భాగం నుండి మరొక భాగానికి సరఫరా చేస్తుంది. ఈ విధంగా ఆహార పదార్థాలు, గ్లూకోస్, లిపిడ్లు, అమైనో ఆమ్లాలు చిన్న పేగు నుంచి కాలేయానికి, యూరియా కాలేయం నుండి మూత్రపిండాలకు, వినాళ గ్రంధుల నుంచి స్రవించే హార్మోన్లు అవి ప్రభావితం చేసే అంగాలకు చేరవేస్తుంది. వీటితోపాటు ప్లాస్మాలో అకర్బన, కర్బన పదార్థాలు ఈ విధంగా ఉంటాయి.

ప్లాస్మాలో సుమారు 0.9 శాతం అకర్బన పదార్థాలుంటాయి. వీటిలో ముఖ్యమైనవి సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మొదలైనవి. కర్బన పదార్థాలలో ముఖ్యమైనవి ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు, ప్రోటీనేతర నత్రజని పదార్థాలు, హార్మోన్లు మొదలగునవి. అయితే వీటిలో అధిక ప్రమాణంలో ఉండేవి ప్రోటీన్లే అని చెప్పవచ్చు. ఇవి సుమారు 7.5 శాతం వరకు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి అల్బుమిన్, గ్లోబ్యూలిన్, ఫైబ్రినోజేన్ మొదలగునవి. లిపిడ్లో కొలెస్టరాల్ మాత్రమే ఎక్కువ ప్రమాణంలో ఉంటుంది. (150-250) కార్బోహైడ్రేట్లలో హెక్సోస్టు (గ్లూకోస్, ఫ్రక్టోస్, గలాక్టోస్) సుమారు 65-90 ఎం.జి. శాతంలో ఉంటాయి. నత్రజని సంబంధిత పదార్థాలైన యూరియా, యూరికామ్లం, క్రియాటినైన్లు, హార్మోన్లు, ఎన్జైమ్ లు, విటమిన్లు చాలా తక్కువ ప్రమాణాలలో ఉంటాయి.

వీటిలో మూడు రకాల కణాలను ముఖ్యంగా గుర్తించవచ్చు.

అవి 1. ఎర్ర రక్తకణాలు (Red blood cells) లేదా అరుణ కణాలు (erthrocytes) ) 2. శ్వేత కణాలు (Leucocytes) లేదా తెల్ల రక్తకణాలు (White Blood corpuscles) ) 3. ప్లేట్లెట్స్ లేదా రక్త ఫలకికలు (Thrombocytes).

ఎర్ర రక్త కణాలు

ఇవి రక్తంలో 93.61 నుండి 95.63 శాతం వరకు ఉంటాయి. జంతువులలో అరుణకణ రూపాలు, పరిమాణాలు, వేరువేరుగా ఉంటాయి. అయితే మానవులలో అరుణ కణాలు ద్విపుటాకారపు బిళ్ళలు, కేశనాళికల ద్వారా పోయేటప్పుడు వీటి ఆకారం మార్పు చెందుతుంది. సాధారణంగా మానవుని రక్తంలో సుమారు 5,20,000 + 300,000 ఘనపు మి.లీ. పురుషులలోను 4,700,000 + 300,000 ఘ.మి.లీ. స్త్రీలలోను ఉంటాయి. ఎర్ర రక్తకణాలు అస్థిమజ్జ (Bone marrow) నుండి జనిస్తాయి. ఇవి శ్వాస వాయువులైన ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ సరఫరా కొరకు ప్రత్యేకించి రూపొందించబడిన కణాలు. క్షీరదాలు మినహా మిగిలిన అన్ని సకశేరుకాలలో ఈ కణాలు కేంద్రకంతో ఉంటాయి. హిమోగ్లోబిన్ అనే శ్వాసవర్ణకం కలిగి ఉంటాయి.

తెల్ల రక్తకణాలు లేదా శ్వేత కణాలు

ఈ కణాలలో వర్ణకం లోపించడం వలన కణ పదార్థం తెల్లగా ఉంటుంది. వీటి సంఖ్య వివిధ జంతువులలో వేర్వేరుగా ఉంటుంది. వీటి సంఖ్య మానవ రక్తంలో 7000 ఘ.మీ. ఉంటుంది. ఇది శోషరస గ్రంధుల నుంచి ఇతర శోషరస కణజాలాల నుంచి రూపొందుతాయి. కణజాల అవసరాలను బట్టి వాటి జీవితకాలం 100-300 రోజులు లేక కొన్నిసార్లు సంవత్సరాలు కూడా ఉంటుంది. ఇవి అమీబా జీవులవలే ఉండి స్పష్టమైన కేంద్రకంతో ఉంటాయి. జీవ పదార్థంలో ఉండే కణికల ఉనికినిబట్టి తెల్ల రక్తకణాలను కణికాభ కణాలు, కణికారహిత కణాలు అని రెండు రకాలుగా విభజించారు.

A) కణికాభ కణాలు (Granulocytes)

ఈ కణాలు అస్థిమజ్జలో రూపొందుతాయి. ఈ కణాల రూపాంతర దశలను మైలాయిడ్ శ్రేణి (Myloid series) అంటారు. వీటి జీవ పదార్థంలో కొన్ని రకాల రేణువులుంటాయి. ఈ రేణువులు వేర్వేరు రంజకాలను పీల్చుకొని ప్రత్యేకమైన వర్ణాలను దాల్చుతాయి. ఈ వర్ణాలను బట్టి వీటిని 1. న్యూట్రోఫిల్స్, 2. ఇయోసినోఫిల్స్,

3. బేసోఫిల్స్ అని మూడు రకాలుగా విభజించారు.

1. న్యూట్రోఫిల్స్ - వీటిని పాలిమార్ఫో న్యూక్లియో సైట్లు అని అంటారు. ఇవి వివిధ పరిమాణాలలో ఉండి, శ్వేత కణాలలో బహు సంఖ్యాకంగా ఉంటాయి. ఇవి తటస్థ రంజకాలలో, ప్రత్యేక వర్ణాన్ని సంతరించుకొంటాయి. ఈ కణాలు వైదేశిక పదార్థాలను (Foreign substances) బాక్టీరియాలను భక్షణ చేసి దేహరక్షణ గావిస్తాయి. వీటిని భోజక కణాలు (phagocytes) అని కూడా అంటారు. ఇవి మానవ రక్త శ్వేత కణాలలో 60-70 శాతం వరకు ఉంటాయి.

2. బేసోఫిల్స్ - ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉండి పెద్ద కేంద్రకంతో ఉంటాయి. ఇవి క్షార రంజకాలతో (Basic stains or dyes) ప్రత్యేక వర్ణాన్ని సంతరించుకొంటాయి. ఇవి మానవుని రక్తంలో కణికా కణాలలో 5 శాతం ఉంటాయి.

3. ఇయోసినోఫిల్లు - ఇవి ఇయోసిన్ అనే రంజకంతో ప్రత్యేక వర్ణాన్ని సంతరించుకొంటాయి. ఇవి మానవ రక్తంలోని శ్వేత కణాల్లో 2.4 శాతం వరకు ఉంటాయి.

B) కణికా రహిత శ్వేతకణాలు (Agranulocytes)

ఇవి శోషరక వ్యవస్థ నుండి రూపొందుతాయి. ఇవి రెండు రకాలు: 1. లసికా కణాలు లేదా లింఫోసైట్లు 2. మోనోసైట్లు. వీటి కణద్రవ్యంలో కణికలుండవు.

లసికా కణాలు - ఇవి గుండ్రంగా ఉండి ఎర్ర కణాల పరిమాణంలో పెద్ద కేంద్రకంతో వీటి కేంద్రకాన్ని ఆవరించి జీవద్రవ్యం పలుచటి పొరలా ఉంటుంది. ఇవి స్వేచ్ఛగా కదులుతూ శోషరసంలో అధికంగా ఉంటాయి. ఇవి ఆంటీటాక్సిన్ (Antitoxin)ను ఉత్పత్తి చేస్తాయి.

ఈ ఆంటీ టాక్సిన్లు అన్య పదార్థాలు ఉత్పత్తి చేసే విషాలను (toxins) తటస్థపరుస్తాయి. కణికా రహిత కణాలలో ఇవి 24 శాతం వరకు ఉంటాయి.

మోనోసైట్లు - తెల్ల రక్త కణాలన్నింటిలోకీ ఈ కణాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ కణాలు పెద్దవిగాను, అండాకారంతో లేదా చిక్కుడు గింజ ఆకారంతో జీవద్రవ్యంలో కేంద్రకంతో ఉంటాయి. ఇవి మానవునిలో సాధారణంగా తెల్ల రక్తకణాలలో 4 శాతం ఉంటాయి. ఇవి రక్తనాళాల వెలుపలి కణజాలంలో కూడా ఉంటాయి. వీటిని క్లాస్మాటో సైట్లు లేదా హిస్టోసైట్లు అని కూడా పిలుస్తారు.

రక్త ఫలకికలు

నిమ్న విభాగాలకు చెందిన జంతువులలో థ్రాంబోసైట్లు (స్కందక కణాలు) అనే ప్రత్యేక కణాలుంటాయి. ఈ కణాలు రక్త స్కందన చర్య ప్రక్రియను నిర్వహిస్తాయి. క్షీరదాలలో మాత్రం పూర్తి కణాలు ఉండవు. రక్తంలో స్కందన చర్యను నిర్వర్తించే నిర్మాణాలు పూర్తి కణాలు కావు. ఇవి కణ ఖండాలు కాబట్టి వీటిని రక్త ఫలకికలు అంటారు. అస్థిమజ్జలో అస్థిక కేంద్రక కణాల నుంచి కణ పదార్థం ముక్కలు ముక్కలుగా రాలి, రక్త ఫలకికలు ఏర్పడతాయి.

రక్తం యొక్క విధులు

రక్తం ప్రవాహ్యక కణజాలం. ఇది జీవులలో చాలా ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది.

1. పోషక పదార్థాల రవాణా - జీర్ణ వ్యవస్థలో సంపూర్ణంగా జీర్ణమైన పోషక పదార్థాలు గ్లూకోస్, ఫ్రక్టోస్, అమైనో ఆమ్లాలు, ఫాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు మొదలగునవి. వీటిని  కుడ్యం పీల్చుకున్నప్పుడు కాలేయ నిర్వాహక వ్యవస్థ ద్వారా రక్తం ఈ పోషక పదార్థాలను కాలేయానికి చేరవేస్తుంది. తరువాత రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా శరీరం అన్ని భాగాలకు చేరవేస్తుంది.

2. విసర్జక పదార్థాల రవాణా - రక్తం విషపూరితమైన నత్రజని సమ్మేళనాలు యూరియా, యూరికామ్లం, క్రియాటినైన్ మొదలైన వాటిని కాలేయం, ఇతర కణ జాలాల నుంచి వృక్కానికి చేరవేస్తుంది. ఇవి వృక్కంలో నిర్గళణం (filter) చెంది బహిష్కృతమవుతాయి.

3. ఆక్సిజన్ రవాణా - అరుణ కణాలలో ఉన్న హిమోగ్లోబిన్ వర్ణకం శ్వాస స్థలాల నుంచి ఆక్సిజన్ ను గ్రహించి ఆక్సీహిమోగ్లోబిన్ గా మారి వివిధ కణాలను చేరి వియోగం చెంది కణజాలాలకు ఆక్సిజన్‌ను సమకూరుస్తుంది.

4. కార్బన్ డై ఆక్సైడ్ రవాణా - ఆక్సీకరణ క్రియలలో కణజాలాల్లో ఏర్పడిన కార్బన్ డై ఆక్సైడ్ ను అరుణ కణాల్లో ఉన్న హిమోగ్లోబిన్, కొద్ది ప్రమాణాలలో గ్రహించి, కార్బాక్సీ హిమోగ్లోబిన్ గా మారి, శ్వాస స్థలాలను చేరి వియోగ క్రియ ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ ను వదిలి వేస్తుంది. రక్తంలోని ప్లాస్మా ద్వారా ఎక్కువ ప్రమాణాలలో కార్బన్ డై ఆక్సైడ్ శ్వాస స్థలాలకు చేరి అటునుంచి నిశ్వాస క్రియ ద్వారా బహిష్కృతమవుతుంది.

5. హార్మోన్ రవాణా - శరీరంలోని వివిధ జీవన క్రియల సమన్వయ క్రమతా సాధనకు వినాళ గ్రంథులు స్రవించే హార్మోన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. రక్తం ఈ హార్మోన్లన్నింటినీ ప్రభావక

అవయవాలకు (Target organs) చేరవేస్తుంది.

6. శరీర pH క్రమత - శరీరంలోని వివిధ కణాల్లో ఎంజైమ్ల చర్యలు సమర్థవంతంగా జరగడానికి ఆయా కణాల్లో యుక్తతమ pH విలువలేర్పడటంలో రక్తంలో ఉన్న చురుకైన బఫరింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది.

7. ద్రవ సమతాస్థితి - ప్లాస్మా ద్రవాభిసరణ పీడనం ద్రవాన్ని లోపలికి ప్రవేశింజేస్తుంది. మరోపక్క సిరానాళికా పీడనం ద్రవాన్ని బయటికి నెడుతుంది. ఈ రెండింటి చర్యల వలన శోషరసం ద్వారా రక్తం కణజాలాల మధ్య నీటి వినిమయం జరుగుతుంది.

8. శరీర ఉష్ణోగ్రతా క్రమత - రక్తంలో 80 శాతం నీరుంటుంది. నీటికి ఉన్న స్థిర ప్రవాహం, విశిష్టోష్ణం అనే ధర్మాలవలన, శరీర అవయవాలలో ఏర్పడిన ఉష్ణాన్ని శరీర ఉపరితలానికి పంపివేయడం ఉష్ణం తక్కువగా ఏర్పడే కణజాలాలకు ఉష్టాన్ని పంపించడం ద్వారా ఉష్ణోగ్రత క్రమతా సాధనలో రక్తం ఉపయోగపడుతుంది.

9. రోగకారక పదార్థాల నుండి రక్షణ - కణికాభశ్వేత కణాలు భక్షణ క్రియ ద్వారా సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. ప్లాస్మా, ప్రోటీన్లు విడుదల చేసే ప్రతిరక్షకాలు రక్తంలోకి ప్రవేశించిన ప్రతిజనకాలను తటస్థపరిచి రక్షణక్రియను నిర్వర్తిస్తాయి.

10. రక్త స్కందన చర్య - ఇది స్వయం రక్షణ చర్య. దెబ్బ తగిలినపుడు రక్తంలోని స్కందక కారకాలు చర్య జరపడంవల్ల రక్తం గడ్డకట్టి శరీరం నుండి ఎక్కువ రక్తం నష్టపోకుండా చేస్తుంది.

శోష రసం

రక్తం, కేశనాళికలలో ప్రయాణించే సమయంలో రక్తంలోని కొంత ద్రవ భాగం కణజాలాలలోనికి చేరుతుంది. దీనిలో చాలా వరకు తిరిగి కేశనాళికలలోనికి ప్రవేశిస్తుంది. మిగిలిన భాగం కణజాలాలలోనే ఉండిపోతుంది. ఇది శోషరస నాళికలలో ప్రవహిస్తుంది. శోషరస కేశనాళికలన్నీ కలిసి క్రమంగా పెద్ద పెద్ద నాళాలుగా రూపొందుతాయి. వీటిని శోషరస నాళాలు అంటారు. నాళాలు పెద్ద సిరలకు సన్నిహితంగా అమరి ఉంటాయి.

 శోషరసం విధులు

రక్తం వలెనే శోషరసం కూడా చాలా విధులను నిర్వర్తిస్తుంది.

1. ఇది రక్తం సరఫరాకాని స్థలాలకు పోషక పదార్థాలను, ఆక్సిజన్ ను అందజేస్తుంది.

2. ఇది ఎక్కువగానున్న కణజాల ద్రవాన్ని, జీవక్రియా ఉత్పన్నాలను తొలగించి కణజాల ద్రవ (Tissue fluid) పరిమాణాన్ని, రచనను స్థిరంగా ఉంచుతుంది.

3. చిన్న పేగు ద్వారా శోషణం చెందిన కొవ్వులను శోషరసం రక్తప్రవాహంలోనికి తీసుకొని పోతుంది.

4. ప్రోటీన్ రవాణాలోను, జీవక్రియలోను పాత్ర వహిస్తుంది.

5. శోషరసంలోని లసికా కణాలు, మోనోసైట్లు శరీర రక్షణ చేస్తాయి.

Comments