Inventions of modern civilization | Druvitha Science
ప్రకృతి మనిషిని కనిపెట్టింది. మనిషి ఆ ప్రకృతిని జయించడానికి నిర్విరామంగా ఎన్నెన్నో కనిపెడుతున్నాడు. కాలాన్ని జయించి తను ఈ సృష్టిలో శాశ్వతంగా నిలిచిపోవడానికి దారులు వేసుకుంటున్నాడు. ఈ మహా ప్రస్థానం ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా ప్రారంభమైంది?
ఆధునిక నాగరికతకు బాటలు వేసిన తొలి ఆవిష్కరణలు
5 మిలియన్ ఏళ్ల క్రితం ఆఫ్రికా మైదానాలపై కోతి మాదిరి కొన్ని ప్రాణులు చలాకీగా గెంతులు వేస్తున్నాయి. అప్పుడప్పుడు నిటారుగా నిలబడి ఓసారి నలుదిక్కులా కలయజూస్తున్నాయి. 10 మిలియన్ సంవత్సరాల నాటి తమ పూర్వీకుల మాదిరిగానే ఇవీ ఉన్నాయి. తేడా అల్లా, అడవిని వదలి ఇవి మైదాన ప్రాంతానికి వచ్చాయి. సదరన్ ఏప్స్ లేదా ఆస్ట్రలోపిథికగా పిలిచే ఈ చింపాంజీ వంటి ప్రాణుల్లో ఆధునిక మానవుడి జాడలు ఉన్నాయి. ఇవి గడ్డీగాదం మానేసి బెర్రీ ఫలాలు, కందమూలాలు తింటున్నాయి. ఇతర జంతువులు తమపై దాడి చేయడానికి వచ్చినప్పుడు చేతుల్తో కర్ర పెళ్ళు, రాళ్లు విసురుతూ తరిమేస్తున్నాయి. ఆత్మరక్షణ కోసం రాళ్లను విసిరిన ఆ చేతులే నేడు విశ్వాంతరాళాన్ని శోధిస్తున్నాయి. 3 మిలియన్ సంవత్సరాలు గడిచేసరికి సదరన్ ఏప్ మైదాన జీవితానికి బాగా అలవాటు పడింది. వాటి కాళ్లు, కటి భాగం, వెన్నెముక గణనీయంగా మార్పులు చెందాయి. దాంతో నిటారుగా నిలబడి పరిగెత్తడం సాధ్యమైంది. ఇంకొంత కాలానికి దవడలు చిన్నవిగా మారి, కపాలం రెట్టింపైంది. శరీరం పొడవు పెరిగింది. 5 అడుగులు ఎత్తున 'నిటారు మనిషి' ఆవిర్భవించాడు. పేరు హోమో ఎరక్టస్.
మరో అర మిలియన్ సంవత్సరాలు గడిచాయి.
ఆత్మరక్షణ కోసం విసిరిన రాళ్లు మానవ అభివృద్ధి తదుపరి దశలో బృహత్తర పాత్ర
పోషించాయి. ఎంతో కష్టం అనిపించే పనులను త్వరగా, తేలికగా
పూర్తి చేయడానికి ఉపకరించాయి. భూగోళం మీద జీవజాతుల నడుమ సమీకరణాలను అవి శాశ్వతంగా
మార్చేశాయి. ఆనాటి అవసరానికి మెదడు సృజనాత్మకత కూడా తోడైంది. శ్రమ తగ్గించే తొలి
పరికరం 'రాతి పని ముట్టు' వెలుగు చూసింది. ఇదే భూగోళంపై తొలి
ఆవిష్కరణ. రాతి పనిముట్లు తయారు చేయడానికి పరిసర ప్రపంచాన్ని నిశితంగా పరిశీలించి
అర్థం చేసుకోవలసి వచ్చింది. ఏ రాయి అయితే విసరడానికి అనువుగా ఉంటుంది, వెళ్లి గట్టిగా తగులుతుంది, అంచు పదునుగా ఉంటుంది అన్న విషయాలు తెలుసుకోవలసిన
అవసరం ఏర్పడింది. అధ్యయనం ద్వారా ఎప్పుడైతే ఈ విషయాలు తెలిశాయో, వేటలో నైపుణ్యం పెరిగింది. దక్షిణ
ఇథియోపియాలోని గోనా కాబా వద్ద మానవ పూర్వీకుల తొలి రాతి పనిముట్లు దొరికాయి. ఇవి 2.6 - 2.5 మిలియన్ ఏళ్ల నాటివి. హోమినిడ్లు
ఉపయోగించిన ఈ పనిముట్లు ఎంతో ప్రాథమిక స్థాయిలో ఉంటాయి.
నూతన ఆవిష్కరణలకు సమాచార మార్పిడి కూడా ఎంతో ముఖ్యం. తొలి రాతి పనిముట్లు వాడిన హోమినిడ్లు చింపాంజీల కంటే ఎక్కువ రకాల శబ్దాలు, సంకేతాలు చేయగలిగాయి. ఆదిమ మానవుడి భాషా కోశంలోకి ఒకటి తర్వాత మరొకటి కొత్త కొత్త పదాలు వచ్చి చేరాయి. వీటితో, అతడు త్వరత్వరగా విషయాలను నేర్చుకోగలిగాడు. మరిన్ని పనులు చేయడానికి పనిముట్లు వాడకం పెరిగింది. కొత్త కొత్త ఆవిష్కరణలు సాధ్యమయ్యాయి. పరస్పరం కమ్యూనికేట్ చేసుకోగలిగిన శక్తి, పనిముట్ల వినియోగం నిటారు మనిషి (అఫ్ రైట్ మ్యాన్) అసాధారణ విజయాలకు బాటలు వేశాయి. జనాభా చకచకా పెరిగింది. ఈలోగా వాతావరణ స్థితులు మారాయి. దాంతో ఆఫ్రికా వెలుపల ప్రత్యామ్నాయ ప్రాంతాల అన్వేషణ అవసరమైంది. అతడు కాలు కదిపాడు. 6 లక్షల సంవత్సరాల క్రితం, ఆసియా యూరప్ల పొడవునా నిటారు మనిషి జనాభా విస్తరించింది.
ప్రపంచం అంతా వాతావరణ వ్యవస్థలు వెంటవెంటనే మారిపోసాగాయి. వేడి, ఆ వెంటనే చల్లదనం. దాదాపు 1,10,000 సంవత్సరాల క్రితం, 'నియాండర్తల్ మ్యాన్' అనే జాతి ఆధునిక మానవులతోపాటే భూమి మీద అవతరించింది. పొట్టిగా, కుదమట్టంగా, బలిష్ఠంగా ఉండే ఈ మనిషికి ఆధునిక మానవులకు దీటుగా, లేదంటే ఎక్కువగా మెదడు ఉండేది. వస్త్రధారణ చేసేవాడు. మేకలు, దుప్పులు వేటాడేవాడు. వేటలో, పనిముట్ల తయారీలో నియాండర్తల్ మనిషి నిష్ణాతుడు. అతడి 'టూల్ కిట్'లో రకరకాల చేతి గొడ్డళ్లు, దబ్బణాలు, కత్తులు, రంపం మాదిరి కోత పనిముట్లు ఉండేవి. కొయ్య, ఎముక, కొమ్ములతో కొత్త వనిముట్లు చేయడానికి ఈ రంపాలు అవసరమయ్యాయి. ఏమైనా భూమ్మీద బహుశ ఒకరికే చోటుందేమో! మనతో సహజీవనం చేసిన నియాండర్తల్ మానవజాతి అంతలోనే అంతరించిపోయింది. అతడి అంతర్ధానం ఇప్పటికీ ఓ మిస్టరీ.
40 వేల సంవత్సరాల క్రితం అసలైన బుద్ధిజీవి 'హోమో షెపియెన్' అవతరించాడు. నాజూకుగా, అథ్లెట్ మాదిరిగా ఉండే ఈ హోమోషెపియెన్ కు దంతాలు చిన్నవి. కపాలం పెద్దది. మరింత పెద్దదైన మెదడు పట్టడానికి అది వీలు కల్పించింది. ముఖ్యమైన మరో అంశం : ఆ మెదడులో భాషా సంబంధ భాగం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది ఉంది. పదుల వేల ఏళ్లనాటి ఆస్థి పంజరాలు చాలా వరకు ఈనాటి మానవ అస్థిపంజరాల్లానే ఉన్నాయి. భూగోళంపై క్రమంగా మంచు కప్పులు విస్తరించి, భారీ జల రాశులు వాటి కింద చిక్కుకున్నాయి. సముద్ర మట్టాలు పడిపోయాయి. దీంతో భూభాగాల నడుమ నేలవంతెనలు ఏర్పడ్డాయి. తొలి మానవులు అమెరికా ఖండాలలోకి ప్రవేశించారు. యూరప్లో చలి పెరిగింది. ఒంటి మీద వెంట్రుకలు లేకపోవడంతో చలి తట్టుకోవడం కష్టమైంది. సృజనాత్మకత మళ్లీ పురివిప్పింది. అప్పటికే ఉన్న రాతి పనిముట్లతో ఉన్ని జంతువులను చంపి, వాటి చర్మాలను తీసి కోట్లు తయారు చేసుకున్నారు. అలాగే, గుహలను వెతుక్కుని వాటిలో నివసించారు. ఈ గుహస్తాశ్రమంలోనే . తను వేటాడిన మెమ్మోత్ (హిమయుగపు భారీ ఏనుగు), రైనోసిరాస్, బైసన్ (అడవి ఎద్దు), దుప్పి, గుర్రం, పశువుల బొమ్మలు గీశాడు. గీతలుగా, చుక్కలుగా రంగురంగులతో కన్పిస్తున్న ఈ చిత్రలేఖనాలు అతడి కుశాగ్రబుద్ధికి, వైవిధ్యానికి నిదర్శనాలు. చెట్ల రంగులు, ఖనిజాలు, పదునైన రాతి ఉలులు ఆనాటి పెయింటర్లు వాడారు. తాము కనిపెట్టిన రాతి పరికరాలతో ఆదా చేసిన సమయాన్ని వారు ఇలా గడిపేవారు. ఏమైనా తొలినాళ్లలో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు జరగటానికి పట్టిన కాలం ఈనాటి ప్రపంచంతో పోల్చనేలేం. పిడులు ఉన్న రాతి పనిముట్లు గణనీయ సాంకేతిక పరిజ్ఞానానికి చిహ్నాలు. విభిన్నమైన మెటీరియల్స్ తో వీటిని అభివృద్ధి పరచుకోవడానికి 2 మిలియన్ ఏళ్లు గడవాల్సి వచ్చింది. ఈ ఆవిష్కరణ కోసురాయి శక్తిని ఎన్నో రెట్లు పెంచింది. పెద్ద పెద్ద జంతువులు వేటాడడం సులభమైంది. చెట్లను నరికి పడేయడానికి బాగా పనికొచ్చాయి. చేతి గొడ్డలి అంచులు రానురాను ఇంకా పల్చగా కోసుగా మారాయి.
ఈటె
జర్మనీలోని షోనింజెన్లో మొట్టమొదటి ఈటె బయట పడింది. ఇది కొయ్యతో తయారైన ఆయుధం. ఈ వినూత్న ఆలోచన మరింత సమర్థవంతమైన ఆయుధానికి వీలు కల్పించింది. కోసుగా చెక్కిన రాతిని కొయ్యకు బిగించి కొత్త ఈటె తయారు చేశారు. ఈ ఈటె పట్టిన వేటగాడు 30 వేల ఏళ్ల నాడు యూరప్ లో నివసించాడు. 17 వేల ఏళ్లనాడు ఈటె విసిరే ఓ సాధనం తయారైంది. దీన్ని యూరేషియా, అమెరికా ఖండాలలో ఉపయోగించారు. మెమ్మోత్ ల వంటి అతి భారీ జంతువులను గురి చూసి వేటాడడానికి ఇది పనికొచ్చింది. ఈటె, ఈటె విసిరే అట్లాట్ సాధనం బహుశ భూమ్మీద చాలా రకాల అడవి మృగాల పాలిట యమపాశాల్లా మారి అవి అంతరించిపోవడానికి ఒక కారణమై ఉంటాయని భావిస్తున్నారు. పనిముట్ల తయారీలో సరికొత్త పరిణామాలు సంభవిస్తూనే ఉన్నాయి. 15 వేల ఏళ్లనాడు, “బ్యూరిన్” అనే సాధనాన్ని తయారు చేశారు. ఇది పరికరాల తయారీని కొత్త మలుపు తిప్పింది. ఒక చివర కోసుగా ఉండి కోయడానికి, మరో చివర ఉలిలా ఉండి చెక్కడానికి పనికొచ్చే ఈ పనిముట్టు ఇతర పనిముట్ల తయారీకి అద్భుతంగా ఉపయోగపడింది. ఎముక నుంచి దుస్తులుకుట్టే సూదులను, చేపలు వేటాడే ఈటెలు, చేపలు తగిలించే కొక్కేలు తయారు చేయడానికి బ్యూరిన్ పనికొచ్చింది. దంతాలను అలంకృత వస్తువులుగా రూపొందించడానికీ ఉపయోగపడింది.
విల్లు - బాణం
కాలం గడుస్తోంది... ఈటె విసిరే సాధనానికి బదులు విల్లు బాణాలు వచ్చాయి. మానవుడు ఇప్పటి వరకూ కనిపెట్టిన అతిగొప్ప యాంత్రిక పరిజ్ఞానం ఇదేనని చెప్పడం అతిశయోక్తి కాదు. బరువు తక్కువ, శక్తివంతం, గురి తప్పనిది, తక్కువ శక్తితో అతి ఎక్కువ దూరం బాణం వేయగలిగే విల్లు నిజంగా ఓ సాంకేతిక విప్లవం. ముక్కోణపు బాణపు ములుకులు కూడా గొప్ప ఆవిష్కరణే. బిరెల్-అటర్ (టునీషియా) వద్ద విలసిల్లిన అటేరియన్ సంస్కృతి ప్రత్యేకత ఈ ముక్కోణపు ములుకు.ఇది మధ్యధరా తీరం పొడవునా వ్యాప్తిలోకి వచ్చింది. 11 వేల ఏళ్లనాడు, న్యూమెక్సికోలోని క్లోవిస్ సమీపాన బ్లాక్ వాటర్ డ్రా వద్ద రెండు కోణాలతో ఈటె ములుకులు తయారు చేసేవారు. ఇవ్వాల్టికీ చాలా ప్రాంతాల గిరిజనుల వేటకు విల్లు, బాణం, ఈటెలే ఆధారం.
నిగ్గుతేల్చిన నిప్పు
మనిషి మేధకు మరో నిదర్శనం నిప్పు. నిప్పు ఎలా రాజేయాలో, మంటల్ని ఎలా అదుపు చేయాలో తెలుసుకోవడం మానవుడికి తిరుగులేని విధంగా భూగోళపు ఆధిపత్యం కట్టబెట్టింది. మరే ఇతర జంతువూ ఈ అద్భుత కృత్యం సాధించలేకపోయింది. ప్రపంచాన్ని మార్చేసే మరోఅవకాశాన్ని అతడు అందిపుచ్చుకున్నాడు. ఎగసిపడే మంటలు మన మెదడులోని చీకటి పొరల్ని వెలిగిస్తాయి. అవంటే ఒక పిచ్చి ఆకర్షణ కలుగుతుంది. అవంటే ఒక వెర్రి భయం ఉత్పన్నమవుతుంది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుతూ గడిపాడు. అగ్ని జ్వాలలపట్ల ఈ అనురక్తికి లక్షల సంవత్సరాల నేపథ్యం ఉంది. మంటలు చూడగానే జన్యువుల్లో నిక్షిప్తమైన ఆనాటి అజ్ఞాత భయాలూ రెక్కలు విప్పుకుంటాయి. అగ్ని అంటే ఆకర్షణ, భయమూ మాత్రమే కాదు. భక్తి ఉంటుంది. మనకు గుర్తు తెలియని నాటి నుంచీ మానవ సంస్కృతిలో అగ్ని ఒక భాగం.
మనిషి నిప్పు ఉపయోగించడం ఎలా
కనిపెట్టాడో మనకు తెలియదు. కాని కనిపెట్టిన క్షణం నుంచీ మనిషి జీవితం అనూహ్యంగా
మారిపోయింది. వేడి, వెలుతురు, శత్రువుల నుంచి రక్షణ, ఉడికించిన తిండి... ఇలా జీవన
విధానాన్నే మార్చేసింది. పనికిరాని పిచ్చి చెట్లను గడ్డిపొదలను తగలబెట్టి నేలను
కావాల్సిన రీతిలో చదును చేయడానికి ఆదిమ మానవుడు నిప్పునే ఆశ్రయించాడు.
మొట్టమొదటిసారి నిప్పు నియంత్రిత వినియోగం కెన్యా, సౌత్ ఆఫ్రికాలలో 1.4 మిలియన్ ఏళ్లనాడు
జరిగింది. సౌత్ ఆఫ్రికాలోని స్వార్ట్ కాన్స్ గుహల్లో వేడి కోసం, రాత్రిపూట క్రూర మృగాల నుంచి రక్షణ
కోసం నిప్పు వాడినట్లు ఆధారాలు లభించాయి. ఉడికించి తినడం తెలియడంతోనే ఆనాటి ఆదిమ
మానవుల 'మెనూ'లోకి చాలా చాలా రకాల మొక్కలు, జంతువులు వచ్చి చేరాయి. నిప్పులతో
మంటలో ఉడికించినప్పుడు వాటిలోని విషతుల్యత తగ్గిపోయింది. పరాన్న జీవులు
చచ్చిపోయాయి. ఏమైనప్పటికీ వారికి స్వంతగా నిప్పు పుట్టించడం బహుశా తెలిసి
ఉండకపోవచ్చు. తగలబడుతున్న అడవుల నుంచి మండే ఒక కట్టెపుల్ల తెచ్చి దాంతో మంట
వేసుకుని, దాన్ని
ఆరిపోకుండా వీలైనంత కాలం వెలిగించుకుంటూ ఉండి ఉండవచ్చు.
చైనాలోని జాకౌడియన్ గుహల్లో 5 లక్షల ఏళ్లనాడు నిప్పు వాడుక ఉన్నట్లు గుర్తించారు. 3 లక్షల సంవత్సరాల క్రితం, ప్రపంచం అంతటా మనిషి నిప్పును ఉపయోగించసాగాడు. నిజంగా అతడిని ఇతర ప్రాణుల నుంచి వేరు చేసి నాగరికుడిగా పుటం పెట్టింది ఈ నిప్పే. ఎందుకంటే మన సోదరులైన చింపాంజీలకు సైతం ఒక స్థాయి వరకు పనిముట్లను ఉపయోగించడం తెలుసు. స్వంత ప్రయోజనం కోసం నిప్పును వినియోగించడంలో ఏ ఇతర జంతువూ ఆరితేరలేదు. మనిషికే అది సాధ్యమైంది. క్రమక్రమంగా నిప్పు వినియోగం పరిధిపెరిగింది. 40 వేల ఏళ్లనాడు, చుట్టూ మంటబెట్టి 60 మెమ్మోత్ లను చెరబట్టినట్లు ఆధారాలు దొరికాయి. చుట్టూ మంటలనడుమ ఆ భారీ ఏనుగులు తొక్కిసలాటకు గురై, ఈటెలు దిగి చనిపోయినట్లు నిర్ధారించారు. స్పెయిన్లోని టోర్రాల్బా సమీపంలో ఈ సంఘటన జరిగింది. కాలక్రమంలో, చెట్లను నరికి వాటిని ఇంధనంగా వాడటం అలవాటైంది. ఆదిమ రాతి గొడ్డలితో చెట్లను నరికేవారు. 5000 ఏళ్ల క్రితం ఆగ్నేయ టర్కీలోని ఖాబూర్ బేసిన్లో అడవులను అపరిమితంగా నరికి వేయడంతో ఇంధన సంక్షోభం తలెత్తింది. దీనికి వారు వెంటనే పరిష్కారం కనిపెట్టారు. జంతువుల మలాన్ని ప్రత్యామ్నాయ ఇంధనంగా వాడటం ప్రారంభించారు. తొలి ఆదివాసులు నిప్పును రకరకాలుగా వాడుకునేవారు. ఒక చోట నుంచి మరో చోటకు సమాచారం అందించడానికి నిప్పు రాజేసి పొగ సంకేతాలు పంపించేవారు. కంపచెట్లు పొదలు తగలబెట్టి కాలిబాటలు వేసుకునేవారు. 'దుష్టశక్తుల్ని పారదోలడం' వంటి సందర్భాలలో అగ్ని ప్రధాన పాత్ర వహించేది. రాత్రిళ్లు జంతువులు దరి చేరకుండా మంటలు వేయడానికి, రాత్రిపూట ప్రయాణానికి దారి కనిపించేలా దివిటీలు వెలిగించటానికి, వేరే తండాలతో పోరాడేందుకు నిప్పు విరివిగా అవసరమయ్యేది.
వర్షపు నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న
చెట్టూ చేమలను తగలబెట్టి పల్లపు ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసుకునే వరకూ మనిషి
దీని ఉపయోగాన్ని పరాకాష్ఠకు చేర్చాడు. వేటలో మరీ ఉపయోగపడ సాగింది. నిలువెత్తున
పెరిగి ఉండే గడ్డి దుబ్బులను అగ్నికి ఆహుతి చేసి జంతువులను కొండ కొమ్ములకు తరుముకుంటూ
పోయేవారు. అక్కడి నుంచి అవి కిందికి దూకి చనిపోయేవి. లేదా, వాటిని ఈటెలు విసిరి తేలికగా చంపేవారు.
తమకు కావల్సిన చోటుకు తరుముకుంటూ వెళ్లడానికి అటు ఇటూ మంటలు పెట్టే ఈ పద్ధతి ఆనాటి
ఆది మానవులకు బ్రహ్మాండంగా పనికొచ్చింది. గంటలకొద్దీ ఒక జంతువు కోసం మాటు వేయాల్సిన
ఆగత్యం తప్పిపోయింది. వాటి జాడ కనిపెట్టడానికి చెట్లల్లో తుప్పల్లో పడుతూ లేస్తూ
పరిగెత్తాల్సిన అవసరం తొలగిపోయింది. దీంతో వారికి బోలెడు సమయం ఆదా అయ్యింది.
రకరకాల ఇతర వ్యాపకాలు వృద్ధి చెందాయి. ప్రకృతి పరిశీలన చేసి ఎన్నో విషయాలు
తెలుసుకున్నారు. ఏడాది పొడవునా మానవ ఆవాసాల వద్ద, చుట్టుపక్కల మంటలు రేగుతూ ఉండేవి. పిడుగుపాటు
వల్లో ఇతరత్రా ప్రకృతి కారణాలతోనో పుట్టే అగ్నికంటే మనిషి పెట్టిన మంటలే ధరిత్రిపై
నిరంతరం మండుతూ, పొగలు
వ్యాపిస్తూ ఉండేవి. వాతావరణంలో మార్పులకూ ఆనాటి మనిషి వాడిన నిప్పులే కారణమని, జీవావరణ సమతుల్యాన్ని అవే దెబ్బతీశాయని
కొంత మంది శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.
పర్యావరణానికి మంట
వేటడానికి గడ్డిపొదలు తగలబెట్టడం
ఈనాటికీ ఆదివాసి తెగల్లో కనిపిస్తింది. ఎండిన తుప్పలను దగ్దం చేస్తే అక్కడ కొత్త
చెట్టుచేమా పెరిగి జంతువులకు ఆశ్రయం కల్పిస్తాయి.
వాటిని మళ్లీ వేటాడి ఆకలి
తీర్చుకోవచ్చు. మానవుడు కనిపెట్టిన ఈ తెలివైన పద్ధతి పర్యావరణం మీద వాతావరణం మీద
అనూహ్య ప్రభావం కనబరచి ఉంటుంది.
చాపకింద నీరులా వాతావరణ మార్పులు చోటు
చేసుకున్నాయి. ఆదిమ మానవులు
ఈ సంగతి ఏనాడూ గుర్తించలేకపోయారు. తరతరాల తరబడిగా
వారీ పద్ధతిని కొనసాగిస్తూ వచ్చారు.
Source : Discovery Magazine-2006
Comments
Post a Comment
Feel Free To Leave A Comment