The adventurer who laddered space|Druvitha Science

 

Druvitha Science


అంతరిక్షానికి నిచ్చెన వేసిన సాహసి

అది ఒక్కపటిమాట కాదు... దాదాపు 90 సంవత్సరాల క్రితం ఓ పిచ్చివాడు ఇలాగే కల గని నవ్వుల పాలయ్యాడు. అతను అల్లాటప్పా కల గనలేదు...... ఏకంగా చంద్రమందలంపైకే నిచ్చెన వేసుకున్నాడు. ఇంకేముంది, సమాజం అతన్ని పిచ్చివాడంది. అయితే, నవ్విన నాపచేనే పండిందన్నట్లుగా అ యువ శాస్త్రవేత్త కృషి చివరికి ఫలించింది. అంతరిక్షయానానికి, క్షిపణి ప్రయోగానికి వాహకంగా సేవలందిస్తున్న రాకెట్ ఆవిష్కృతమైంది.

Druvitha Science
Dr. Robert H. Goddard (Image Source Wikipedia)
అతని పేరు రాబర్ట్ గొడార్డ్. అమెరికాలోని మసాచ్ సెట్స్ రాష్ట్రం వర్సెస్టర్ లో 1882లో జన్మించాడు. బాలరాబర్ట్ దృష్టి బాణాసంచాపై పడింది. తారాజువ్వ ఆకాశంలోకి దూసుకెళ్ళడం అతనిలో ఆసక్తిని పెంచింది. టపాకాయల్లో ఉపయోగించే రకరకాల పేలుడు పదార్థాల లోతుపాతులు తెలుసుకోవాలనుకున్నాడు. ఈ రసాయన విస్ఫోటాలను ఆకాశయానానికి ఎంతవరకు ఉపయోగించుకోవచ్చన్న అంశంపై పరిశోధన చేయాలనుకున్నాడు. చుట్టుపక్కలవాళ్ళు ఎంత నవ్వుకున్నా ప్రయత్నం ఆపలేదు.

1920లో క్లార్క్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రోజుల్లో తన రాకెట్ పరిశోధనలపై ఒక పత్రం ప్రచురించాడు. రాకెట్ ను అతరిక్షంలోకి పంపించడమంటే అయ్యేపని కాదని సహ అధ్యాపకులంతా స్థిరమైన అభిప్రాయంతో ఉన్నప్పటికీ గొడార్డ్ చెరగని ఆత్మవిశ్వాసంతో పరిశోధన కొనసాగించాడు. రాకెట్ యానం ఆచరణీయమైనదేనని నొక్కిచెపుతూ, అంతరిక్షంలో అత్యున్నత ఎత్తును చేరుకోవడం సాధ్యమేనన్న తన అభిప్రాయాన్ని పరిశోధనపత్రంలో చేర్చాడు. సామాన్య పాఠకులకు ఇందులో పెద్దగా ఆసక్తి కలిగించే విషయమేమీ లేకపోయినప్పటికీ, వ్యాసానికి ఇచ్చిన ముగింపు అందరి దృష్టినీ ఆకర్షించింది. “ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పెద్ద రాకెట్ తయారు చేసి, అందులో తగిన శక్తిగల ఇంధనాన్ని చేర్చితే చంద్రమండలం చేరుకోవచ్చు” అంటూ ఆయన తన వ్యాసాన్ని ముగించాడు.

పత్రికలు దుమ్మెత్తి పోస్తాయని, జనం విమర్శలు చేస్తారని ఆయన భయపడుతూనే ఉన్నాడు.... అనుకున్నంతా అయింది... 1920 జనవరి 13'న్యూయార్క్ టైమ్స్' పత్రిక గొడార్డ్ సిద్ధాంతాన్ని తూర్పారబడుతూ సంపాదకీయం ప్రచురించింది. అంతరిక్షంలో అంతా శూన్యమే కాబట్టి రాకెట్ ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేదని పేర్కొంది. గురుత్వాకర్షణ శక్తి లేని కారణంగా అంతరిక్ష ప్రయాణం అసాధ్యమని విశ్లేషించింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పే గొడార్డ్ తెలివిలేని రాతలు రాశాడంటూ పత్రిక నిప్పులు చెరిగింది.

గొడార్డ్ ఎంతో బాధపడ్డాడు. పత్రికా సంపాదకులు విజ్ఞానశాస్త్రాన్ని అర్థం చేసుకోనందుకు కాదు, తన పరిశోధనలకు విలువివ్వనందుకూ కాదు, తనను మూర్ఖుని కింద జమకట్టినందుకు ఆయన హృదయం గాయపడింది. పరిశోధనను విశ్లేషించడం పత్రికల హక్కు కావచ్చుగాని, పరిశోధకుని అవమానించే హక్కు ఎవరికీ లేదని తన సన్నిహితుల వద్ద వాపోయాడు. తన పరిశోధనలకు తుదిరూపు వచ్చేదాకా వివరాలను బయటకు చెప్పకూడదని నిశ్చయించుకున్నాడు. అలా లోలోపల చేసిన పరిశోధనలే తరువాతి కాలంలో ఆయనను ఆధునిక రాకెట్ శాస్త్ర పితామహునిగా నిలబెట్టాయి.

క్లార్క్ యూనివర్సిటీ ఉద్యోగంలో చేరడానికి ముందు ఆయన వర్సెస్టర్ పాలిటెక్నిక్ ఇన్స్టి ట్యూట్ లో అధ్యాపకునిగా పనిచేశాడు. వివిధ ఇంధనాల శక్తిని అంచనా వేసే ప్రాథమిక పరిశోధనను ఆయన అక్కడే ప్రారంభించాడు. రాకెట్ బరువుకు, ఇంధనశక్తికి మధ్య నిష్పత్తిని కనుగొన్నాడు. ప్రతి చర్యకూ ప్రతిచర్య ఉంటుందన్న న్యూటన్ సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొని, గాలి చొరబడని చాంబర్లలో ప్రయోగాలు చేశాడు. శూన్యంలో కూడా రాకెట్ ప్రయాణించగలదని ధ్రువపరచుకున్నాడు. రసాయన పేలుడు పదార్థాలపై విస్తృత పరిశోధనలు చేసి, రాకెట్ ను ఎక్కువ ఎత్తు తీసుకుపోవాలంటే తారాజువ్వల్లో వాడే పొడిపదార్థం సరిపోదని తెలుసుకున్నాడు. కిరోసిన్ లేదా ద్రవ హైడ్రోజన్లో ద్రవ ఆక్సిజన్ కలిపి ఇంధనంగా వాడితే శూన్యంలో కూడా దహనశక్తి కలిగి ఉంటుందని కనుగొన్నాడు. దాదాపు 20 సంవత్సరాలపాటు గొడార్డ్ సిద్ధాంతాలు కేవలం సిద్ధాంతాలుగానే మిగిలి పోయాయి. పరిశోధనలను ముందుకు తీసుకుపోయేందుకు ఆయన విశాలమైన పొలాల్లో రాకెట్‌ను అమర్చి ప్రయోగించాడు. అది తుస్సుమంది. అంగుళం కూడా పైకి ఎగరలేదు. బాధతో క్లార్క్ యూనివర్సిటీ చేరుకున్న గొడార్డ్ కు ఎక సెక్కాలు ఎదురయ్యాయి. 'అయ్యా రాబర్ట్, మీ రాకెట్ చంద్రమండల యాత్ర ఎలా సాగుతోంది?” అంటూ ఆట పట్టించారు. అయినా ఈ అవమానా లేవీ ఆయన ఆత్మవిశ్వాసాన్ని కదిలించలేదు.

1926 మార్చి 16న పది అడుగుల గల రాకెట్ తయారుచేసి కారులో అమర్చి సమీంలోని పొలాల్లోకి తీసుకుపోయాడు. 'నెల్' అని నామకరణం చేసి ఆ రాకెట్ ఇంధనానికి నిప్పంటించాడు. కొద్ది సెకన్లు అది కదలలేదు, ఆందోళనగా చూస్తుండగానే గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాల్లోకి ఎగిరింది. 41 అడుగులు ఎత్తు ఎగిరి 184 అడుగులు దూరాన భూమిపై పడింది. రెండున్నర సెకన్లపాటు ఈ ప్రయోగం జరిగింది. ద్రవ ఇంధనంతో రాకెట్ ప్రయోగం అదే మొదటిది. గొడార్డ్ ఆనందానికి అవధులు లేవు. అయితే ఈసారి ఆయన పత్రికల దృష్టికి రాకుండా జాగ్రత్త పడ్డాడు. పరిశోధనలు ఇంతదూరం వచ్చిన తర్వాత కూడా జనం తనను పిచ్చివాడని గేలిచేస్తే తట్టుకునే స్థితిలో లేడు.

ఎంతో గోప్యంగా ఉంచుదామనుకున్నా, బహిరంగ ప్రయోగాలు జనం దృష్టిలో పడ్డాయి. రాకెట్ చంద్రమండలం వైపు ఎంత దూరం వెళ్ళిందని ఎవరైనా అడిగితే 'పని నడుస్తోంది, చెప్పుకోదగిన పురోగతి లేదు' అని బదులిచ్చేవాడు. పరిశోధనలో ఒక్కొక్క అడుగూ ముందుకు వేస్తున్నప్పుడు వాటి వివరాలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

అయితే రాకెట్ దాగేటంత చిన్న పరికరం కాదు కదా!

రోజురోజుకూ పరిమాణం పెంచుకుంటూ ఎక్కువ ఎత్తుకు ప్రయోగిస్తుంటే అందరి దృష్టి అటువైపు మళ్ళింది. 1929లో 11 అడుగుల పొడవైన 'నెల్'ను ప్రయోగించడం వర్సెస్టర్ లో సంచలనం కలిగించింది. పోలీసులు రంగప్రవేశం చేసి నానారకాలుగా ప్రశ్నించారు. పోలీసులతో పాటు విలేఖరులూ వచ్చారు. స్థానిక దిన పత్రికలో మరుసటి రోజు, 'చంద్రమండల రాకెట్ 2,38,799 మైళ్ళ దూరంలో చతికిలపడింది' ' అనే శీర్షికతో అవమానకరమైన వార్త ప్రచురించింది. ఈ దశలో హారీ గెగెన్‌హీమ్ అనే ఫైనాన్షియర్ లక్ష డాలర్ల సహాయం చేసేందుకు ముందుకు వచ్చి, ఉత్తర మెక్సికోలోని సువిశాలమైన ప్రదేశాన్ని పరిశోధనల కోసం కేటాయించాడు. అక్కడ పరిశోధనకు అనువైన వాతావరణం ఉండడంతో 12, 16, 18 అడుగుల ఎత్తుదాకా రాకెట్ పొడవు పెంచగలిగాడు. ధ్వని వేగాన్ని మించిన రాకెట్ ను తయారుచేసి ఆకాశయాన పరిజ్ఞానంలో అనేక పేటెంట్లను సొంతం చేసుకున్నాడు. 1930వ దశకంలో గొడార్డ్ పరిశోధనలపై జర్మన్ల కన్నుపడింది. జర్మన్ ఇంజనీర్లు తరచూ వచ్చి ఆయనను పలు సందేహాలు అడిగేవారు.

1939లో జర్మన్లు ఉన్నట్టుండి ఆయనను కలవడం మానేశారు. అప్పటికే వారు రాకెట్లు తయారు చేసుకొని బాంబు ప్రయోగానికి ఉపయోగిస్తున్నారని తెలిసింది. దీనితో గొడార్డ్ అమెరికా సైనికాధికారులను కలిసి రాకెట్ ప్రయోగ చిత్రాలను చూపించారు. యుద్ధంలో అవసరాల కోసం రాకెట్ దిశను కాస్త వంకరగా కూడా తిప్పవచ్చని చెప్పాడు. అధికారులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఐదేళ్ళ తర్వాత జర్మనీ విధ్వంసకరమైన వి-2 రాకెట్ను లండన్ పై ప్రయోగించింది. శాంతియుత అవసరాల కోసం తాను తయారు చేసిన 'నెల్' నమూనాను అనుకరించి జర్మన్లు వి-2 రాకెట్ తయారుచేసినట్లు గొడార్డ్ గ్రహించాడు. జర్మన్ శాస్త్రవేత్తను అమెరికా నిర్భందించింది. వి-2 రాకెట్ల పుట్టుక గురించి తరచితరచి ప్రశ్నించగా, “మీ గొడార్డ్ ను అడగండి. మా అందరికంటే ఆయనకే బాగా తెలుసు” అని సమాధానమిచ్చాడు. అమెరికా కొన్ని వి-2 రాకెట్లను సంపాదించి గొడార్డ్ చేత వాటి నిర్మాణాన్ని పరీక్షింపజేసింది. అవి తన 'నెల్'కు ప్రతిరూపాలని ఆయన ధ్రువీకరించాడు.

Goddard loading a bazooka in 1918 (Image Source Wikipedia)

గొడార్డ్ కీర్తి దశదిశల వ్యాపించింది. ప్రపంచం ఆయన గొప్పతనాన్ని గ్రహించి కీర్తిస్తున్న సమయంలో 1945లో గొంతుక్యాన్సర్ సోకింది. ఒక సంవత్సరం తిరగకుండానే తుదిశ్వాస విడిచాడు. ఆయన ప్రారంభించిన పరిశోధన మాత్రం ఆగలేదు. అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా అగ్రస్థానానికి చేరుకుంది. 1968లో అమెరికా చంద్రమండల యాత్ర ప్రారంభించిన రోజు 'న్యూయార్క్ టైమ్స్' మళ్ళీ సంపాదకీయం రాసింది. అంతకుముందు 49 సంవత్సరాల క్రితం గొడార్డు అవమానిస్తూ సంపాదకీయం రాసి నందుకు విచారం వ్యక్తం చేసింది. అంతరిక్షయానం సాధ్యమేనని ఒప్పుకుంది. ఒక పరిశోధకుని విజయానికి ఇంతకంటే మంచి నివాళి ఏముంటుంది?

గమనిక :

  • మాకు మీ సలహాలు – సూచనలు అవసరం.
  • పై సమాచారం వలన మీకు ఏవైనా ఇబ్బందులు/ నష్టాలు జరిగితే మేము బాధ్యులము కాదు.
  • మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులను సరి చేసుకుంటాము. ఇంకోసారి  జరగకుండ చూసుకుంటాము.

దృవిత సైన్స్ ను Follow అవ్వండి

మరిన్ని వివరాల కోసం దృవిత సైన్స్ ను చూడండి

Comments