List of organs in human body | Human Organs | Druvitha Science


Human Organs| Druvitha Science | DruvithaScience

మానవ శరీరం ఒక ఇల్లు లాంటి కట్టడం, ఇల్లు కట్టడానికి ఇటుకలు ముఖ్యం అలాగే, దేహ నిర్మాణానికి కణాలు కావాలి. మానవ శరీరంలో ఎన్ని కణాలు ఉంటాయో తెలుసా? 100 ట్రిలియన్లు (100 లక్షల కోట్లు). ముందుగా ఏ రకం కణాలు ఆ రకం కణజాలంగా(టిష్యులుగా) కలిసిపోతాయి. కొవ్వు, నరాలు, కండరాలు ఆ రకం టిష్యులాతో నిర్మితమై ఉంటాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల టిష్యులు కలిసి ఒక దేహ భాగంగా ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన గుండె, ఉదరం, మెదడు వంటి భాగాలు ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన పనిని చేస్తూ ఉంటాయి. వీటినే మనం అవయవాలు అనీ ఆర్గాన్స్ అని అంటారు.
రక్తం
రక్తం ద్రవ రూపంలో ఉండే కణజాలం. ఇది శరీరం అంతటా రక్తనాళాల ద్వారా ప్రవహిస్తూ, ఆయా భాగాలకు అవసరమైన ఆక్సిజన్ ను ఆహారాన్ని చేరవేస్తుంది. కార్బన్ డై ఆక్సైడ్ ను ఇతర మలినాలను తొలగించి వాటిని శుద్ధిచేస్తుంది. లవణాలు, చక్కర, ఇతర రసాయనాలతో ఉండే నీటి మిశ్రమంలో ఎర్రటి రక్తకణాలు కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. ఆక్సిజన్ కలవడం వలన రక్తనాళాలు ఎర్రగా ఉంటాయి.
చర్మం
దేహంలో అతి పెద్ద అవయం చర్మం. లోపలి భాగాలకు ఇది రక్షణ కవచం. ఇది స్పర్శను కలిగించే జ్ఞానేద్రియం. చర్మం మందం సగటున కేవలం 2 మిల్లి మీటర్లే అయినా రక్తంలో 8వ వంతు దీనికే సరఫరా అవుతుంది.
వెంట్రుకలు
కళ్ళు, పెదాలు, అరచేతులు, అరికాళ్ళు తప్పా శరీరం అంతటా ఎక్కువగానో తక్కువగానో వెంట్రుకలు పెరుగుతాయి. వెంట్రుకలకు జీవం ఉండదు. మృత కణాల తాలుకు కెరటీన్ అనే పదార్థంతో ఇవి తయారు అవుతాయి. తలమీద సుమారు 1,20,000 వెంట్రుకలు ఉంటాయి. ఇవి వారానికి 3 మిల్లీమీటర్ల పొడువు పెరుగుతాయి.
కొవ్వు
నిరుపయోగంగా ఉన్న శక్తిని దేహం కొవ్వు రూపంలో నిల్వ చేస్తుంది. ఇది చర్మ కింద, ఇతర అవయవాల చుట్టూ పేరుకుపోయి ఉంటుంది. శరీరం పని చేయడానికి కావలసిన 3 ప్రధాన పోషకాలలో కొవ్వు ఒకటి. మిగిలిన రెండు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు.
ఎముకలు
ఎముకలన్నీ కలసి అస్థిపంజరం లాగా ఏర్పడుతాయి. ఇది శరీరంలో ప్రతీ భాగాన్ని దాన్ని స్థానంలో ఉండే దాన్ని సుస్థిరంగా ఉంచుతుంది. ఎముకల మధ్య ఉండే కీళ్ళ వల్ల మనం శరీర భాగాలను కావాల్సిన రీతిలో కదిలించగలుగుతున్నాము. ఎముకలు చాలా గట్టివి. ఉక్కు కంటే 5 రెట్లు పటుత్వంతో ఉంటాయి. కానీ బరువు మాత్రం తక్కువగా ఉంటాయి.శరీరం మొత్తం బరువులో ఇవి 14 శాతం మాత్రమే ఉంటాయి.
కండరాలు
కండరాలు పోగుల్లాంటి పదార్థంతో ఏర్పడతాయి. ఇవి ముడుచుకోగలవు. అవయవాలకు అనుగుణంగా వ్యాకోచించగలవు. ఇవి ఎముకల చుట్టూ ఉంటాయి. అంతర్గత అవయవాలైన గుండె వంటి భాగాలు కండర నిర్మితమే.  దేహంలోకెల్లా అతి చిన్న కండరం చెవిలోపల ఉంటుంది. దీన్ని స్టేపీడియాస్ అంటారు. తోడ కండరం అతి పొడవైంది.
రక్తనాళాలు
రక్తం ప్రవహించే గొట్టాలే రక్తనాళాలు. దమనుల్లో(ఆర్టరీస్) మంచి రక్తం, సిరాల్లో(వేయిన్స్) మాలిన రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. చిన్నవీ పెద్దవీ అన్ని కలిపి 1,00,000 కీ.మీ. పొడవు ఉండే రక్తనాళాల్లో ప్రయాణించడానికి రక్తానికి 90 సెకన్లు కుడా పట్టదు!
గుండె
రక్తాన్ని శరీరం అంతటికి పంపు చేసే పరికరం గుండె. ఇది జీవిత కాలంలో ఒక్కసారి కుడా ఆగిపోదు .విశ్రాంతి లేకుండా పని చేస్తుంది. ఛాతీ మధ్యన లోపల ఉండే ఈ అవయవం చేతి పిడికిలి అంతే ఉంటుంది. మనిషి సగటు జీవిత కాలంలో గుండె 20 కోట్ల లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తుంది.
ఊపిరితిత్తులు
ప్రాణవాయువైనా  ఆక్సిజన్ను గాలి నుంచి తీసుకొని రక్తానికి అందించేవే ఊపిరితిత్తులు. రొమ్ము కింద, స్పాంజీలా మృదువుగా ఉండే ఊపిరితిత్తుల్లో 30 కోట్ల చిన్న చిన్న గాలి సంచులు ఉంటాయి.
మూత్రపిండాలు
దేహంలో నిరంతరం రసాయనిక వ్యర్థాలు తయారవుతూ ఉంటాయి. మూత్రపిండాలు రక్తం నుంచి వీటిని వడకట్టి మూత్ర రూపంలో విసర్జిస్తాయి. దేహంలో అదనంగా ఉండే నీటిని గ్రహించి ఇవి బయటికి పంపిస్తాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే ఈ మూత్రపిండాలు నిమిషానికి 1.3 లీటర్ల రక్తాన్ని వడకడతాయి. ప్రతి పది నిమిషాలకోసారి చొప్పున రోజు మొత్తం మీద దాదాపు 150 సార్లు రక్తం ఫిల్టర్ అవుతుంది.
మూత్రకోశం
మూత్రపిండాలలో(కిడ్నిలు) తయారైన మూత్రం వాటికి  అనుసంధానమై ఉండే ఒక సంచిలోకి దిగుతుంది. ఇదే మూత్రకోశం(బ్లాడర్). మూత్రకోశం నిండగానే మనకు మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది.
ఉదరకోశం
ఇంగ్లీష్ “జే” అక్షరంలా ఉండే ఉదరం ఆహారాన్ని చిన్న చిన్న కణాలుగా విడగొడుతుంది. ఆమ్లం సహాయంతో ఈ జీర్ణక్రియ జరుగుతుంది. నోటితో నమిలి మింగిన ఆహారం పొడవాటి ఆహార నాళం ద్వారా ఉదరంలోకి ప్రవేశిస్తుంది. జీర్ణక్రియలో సగం ఇక్కడే పూర్తవుతుంది.
పేగులు
ఉదరకోశంలో నుంచి సగం సగం జీర్ణమైన ఆహారం చిన్న పెగుల్లోకి ప్రవేశించి పూర్తిగా జీర్ణమై రసాయనిక సూక్ష్మాణువుల రూపంలోకి మారుతుంది. వీటిని పోషకాలు అంటారు. ఇవి పేగు గోడల ద్వారా నేరుగా రక్తంలోకి ప్రవేశిస్తాయి. రక్తం వీటిని ఆయా శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. మిగిలిన వ్యర్థాలు పెద్ద పేగు నుంచి బయటకు విసర్జితమవుతుంది.
కాలేయం
కాలేయం ఒక రకమైన కెమికల్ ఫాక్టరీ. ఆహారం జీర్ణమవటం ద్వారా లభించిన పోషకాలను, ఇతర పదార్థాలను కాలేయం స్వీకరించి వాటిని సరైన సమయంలో శరీరానికి సరఫరా చేస్తుంది. రక్తంలో వివిధ రసాయనాలు సమానంగా ఉండేలా చేస్తుంది.
దంతాలు
మనం తినే ఆహార పదార్థాలను నమిలేందుకు దంతాలు అవసరం. ఎంత గట్టివాటినైన మెత్తగా నమిలి ముద్దలా మార్చుతాయి. ఆరు నెలల పాపాయికి దాదాపు 20 పాల దంతాలు ఉంటాయి. ఆరేళ్లు రావడంతోనే 32 దంతాలు వస్తాయి. ఇవి పైన 16, కింద 16 ఉంటాయి. దవడమూలల్లో చిట్ట చివరగా వచ్చే నాలుగు పళ్ళను జ్ఞాన దంతాలు అంటారు. ఇవి కొందరిలో కనిపించకపోవచ్చు. దంతాల మీద ఎనామిల్ పొర ఉంటుంది.
మెదడు
మెదడు శరీరానికి అధిపతి అంటారు. మెదడు ఆదేశానుసారం శరీరం పని చేస్తుంది. తెలివైన ఈ భాగంలో 10,000 కోట్ల నాడీ కణాలు(న్యూరాన్లు) ఉంటాయి. ఒక్కో నాడీకణం 25 వేల ఇతర నాడీ కణాలతో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి, లక్షల కోట్ల సమాచార మార్గాలు ఏర్పడి వాటి ద్వారా నాడీ సంకేతాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఆడపిల్లల మెదడు మగ పిల్లల మెదడు కంటే పెద్దది. శరీరం బరువులో ఇది ఆడపిల్లల్లో 2.5 శాతం, మగపిల్లల్లో 2 శాతం మెదడు ఉంటుంది.
ఆలోచనలకు, జ్ఞాపకాలకు, భావాలకు మెదడు నిలయం.
కన్ను, చెవి, ముక్కు
జ్ఞానేంద్రియాలలో కన్ను, చెవి, ముక్కు కీలకమైనది. కళ్ళు రెండూ ఒకేలా చూడలేవు. కుడి కన్ను బాగా చూడగలుగుతుంది. అయినా మనకు ప్రపంచం ఒక్కలాగే స్పష్టంగా కనిపిస్తుంది. మెదడు రెండు కళ్ళు చూసి పంపిన సమాచారాన్ని క్రోడీకరించి సమగ్ర చిత్రంగా మార్చుతుంది. శబ్దం లేనిదే దృశ్యానికి నిండుదనం రాదు. సమాచార స్వీకరణలో చెవి పాత్ర ముఖ్యమైనదే. చెవులు శబ్దాలు గ్రహించి మెదడుకు చేరవేస్తాయి. మెదడు వాటి భావాన్ని విశ్లేషిస్తుంది. మామూలు వినికిడి శక్తి ఉన్నవాళ్ళు సెకనుకు 20 నుంచి 20,000 ప్రకంపనల ద్వని వినగలరు. ఇక మనషి ముక్కు 10 వేల రసాయనాలు వాసన చూసి వాటి మద్య తేడాను గుర్తించగలదు. కుక్కలు వాసనలు గుర్తించడంలో, గుర్తుకోవడంలో ముందుంటాయి. మనం గుర్తించ గలిగిన వాసన కంటే 10 వేల రెట్లు తక్కువ వాసనను కూడా అవి పసిగట్టగలవు.
  • మానవ శరీరం 9 సీసాల రక్తం, 2 చదరపు మీటర్ల చర్మం, 50 లక్షల వెంట్రుకలు, 1 బకెట్ కొవ్వు, 206 ఎముకలు, 640 కండరాలు, 1 లక్ష కిలోమీటర్ల రక్తనాళాలు,1 గుండె, 2 ఊపిరితిత్తులు, 2 మూత్రపిండాలు, 1 మూత్రకోశం, 1 ఉదరకోశం, 9 మీటర్ల పేగులు, 1 కాలేయం, 32 దంతాలు, 1 మెదడు, ఒక సెట్టు జ్ఞానేద్రియాలతో నిర్మితం అవుతుంది.
Source : Discovery Magazine - 2006

వీక్షకులకు గమనిక :
  • మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము. మాకు మీ సలహాలు – సూచనలు అవసరం.
  • సైన్స్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఉంటే రాసి పంపండి. మీ పేరుతో ప్రచురణ చేస్తాం.

దృవిత సైన్స్ ను Follow అవ్వండి
మరిన్ని వివరాల కోసం Druvitha Science ను చూడండి

Comments

Post a Comment

Feel Free To Leave A Comment