Human Digestive System | Digestive System How It Work | DruvithaScience

Druvithascience


మనము ఏ పని చేయాలన్న మనకు శక్తి అవసరము. ఇక్కడ శక్తి అంటే పోషక పదార్థాలైన పిండిపదార్థాలు(కార్బోహైడ్రేట్స్), మాంసకృత్తులు(ప్రోటీన్లు), కొవ్వు పదార్థాలు(ఫ్యాట్స్). చక్కటి ఆరోగ్యాన్నిచ్చే విటమిన్లు, ఖనిజాలతో కూడినది. వీటన్నింటిని మనము ఆహార రూపంలో తీసుకుంటున్నాము. ఈ ఆహారంలో ఉండే పోషకాలు జీర్ణక్రియ ద్వారా శరీరా భాగాలకు శక్తి అందుతుంది.
చెట్టు చేమల్ని జంతువులను మానవ రక్తమాంసాలుగా, ఎముకలుగా, ఇంధనాలుగా, మార్చిపడేసే అద్భుతకృత్యం మన దేహంలో అనునిత్యం జరుగుతూ ఉంటుంది. ఒక జామకాయ తింటే అది మనంగా మారిపోతుంది. దాన్ని పాత ఆనవాళ్లేవి వీసమెత్తు కూడా మిగలవు. జీర్ణ వ్యవస్థ ఒక రివర్స్ అసెంబ్లీ లైన్ వంటిది కారు తయారు చేయడానికి వరుసగా ఒక్కొక్క భాగాన్ని బిగిస్తూ పోతారు అసెంబ్లీ లైన్ లో చివరికి వెళ్లేసరికి పూర్తి కారు తయారై ఉంటుంది. జీర్ణ వ్యవస్థ అందుకు పూర్తి భిన్నంగా ఆహారాన్ని కణాలుగా రసాయనిక అణువులుగా విడగొట్టి వేస్తుంది. వీటిలో నుంచి పనికొచ్చే పోషకాలను శరీర వ్యవస్థ గ్రహించి వ్యర్థమైన వాటిని విసర్జిస్తుంది. ఒక్క రోజు వ్యవధిలో ఇదంతా జరిగి పోతుంది. పోషకాలు మనం పనులు చేసుకోవడానికి కావలసిన శక్తినిస్తాయి. శరీరంలో చనిపోతూ ఉండే కణాల స్థానంలోనే కొత్త వాటిని అందిస్తాయి. దేహ భాగాలు సక్రమంగా ఆరోగ్యంగా పనిచేయడానికి ఇవి అవసరం.
మనం ఆహారం నుంచి ప్రధానంగా స్వీకరించేది పిండిపదార్థాలు(కార్బోహైడ్రేట్స్), మాంసకృత్తులు(ప్రోటీన్లు), కొవ్వు పదార్థాలు(ఫ్యాట్స్). చక్కటి ఆరోగ్యాన్నిచ్చే విటమిన్లు, ఖనిజాలు కూడా పోషకాల కిందకే వస్తాయి. ఇవి తక్కువ పరిమాణంలోనే అవసరమవుతాయి. ఇవన్నీ తగుపాళ్లలో ఉండే ఆహారాన్ని సమీకృత ఆహారం(బ్యాలెన్స్డ్ ఫుడ్) అంటారు.
జీర్ణక్రియ నోటితోనే ప్రారంభమవుతుంది. 30 అడుగుల (9.1 మీటర్ల) జీర్ణ నాళం ద్వారా ఆహార పదార్థాలు సాగించే 24 గంటల ప్రయాణంలో ఇది మొదటి స్టాప్. పళ్ళతో నమిలి ఆహారాన్ని జీర్ణం చేయటంలో లాలాజలం తన వంతు పాత్ర పోషిస్తుంది. మన నోటిలో ప్రతిరోజు 1.4 లీటర్ల లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఉండే “ఎమిలేజ్” అనే ఎంజైము ఆహారంలోంచి కార్బోహైడ్రేట్స్ ను వేరుచేస్తుంది.
లాలాజలం నాలుక సహాయంతో ఆహారాన్ని ముద్దగా మారుస్తుంది. చిన్న చిన్న ముద్దలు గొంతు ద్వారా ఇట్టే లోపలికి జారిపోతాయి. గొంతులోకి రాగానే అక్కడ ఉండే  “బోను మూత లాంటిది టక్కున శ్వాసనాళాన్నీ మూసివేస్తుంది. “ఈసోఫాగస్” నాళంలోకే దారి తెరచి ఉంటుంది. 10 అంగుళాల ఈసోఫాగస్ గొట్టం నేరుగా పొట్టలోకి వెళ్లేదారి. దీనికి ఉండే 2 పొరల కండరాలు సంకోచ వ్యాకోచాలు చెందుతూ ఆహారాన్ని బాగా కలగలుపుతాయి. మన చేతులు అన్నం ఎలా కలుపుతాయో ఇవి అలా పని చేస్తాయి. “ఈసోఫాగస్” చివరి భాగమే J ఆకారంలో ఉండే ఉదరకోశం. ఖాళీగా ఉన్నప్పుడు ముడతలు ముడతలుగా మూసుకుని ఉండి ఆహారం ప్రవేశించగానే ఆ మేరకు విస్తరిస్తోంది.ఇందులోకి చేరిన పదార్థాలు వెనక్కు ఈసోఫాగస్ లోకి వెళ్లకుండా ఉంచడానికి, తక్షణం చిన్నపేగులోకి జారిపోకుండా ఉంచడానికి ”స్పింక్టర్స్” అనే రింగు మాదిరి వాల్వ్ కండరాలు ఉంటాయి.
Druvithascience

ఉదరకోశ గోడల్లో ఉండే 35 మిలియన్ల గ్రంధుల నుంచి ఉత్పత్తి అయ్యే జీర్ణరసాల్లో “పెప్సిన్” అనే ఎంజైము ముఖ్యమైనది. ఇది ప్రోటీన్లను వేరుచేస్తుంది. అత్యంత శక్తివంతమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం కూడా ఉదరకోశంలో విడుదలవుతుంది. ఈ ఆమ్లం సహాయంతో “పెప్సిన్” తన పనిని మరింత సులభంగా చేస్తుంది. యాసిడ్(హైడ్రోక్లోరిక్ ఆమ్లం) మరోలా కూడా ఉపయోగపడుతుంది. ఆహారంతో వచ్చే బ్యాక్టీరియాలను, ఇతరత్రా జీవకణాలను ఇది చంపేస్తుంది.
“పైలోరస్” అనే ఎగ్జిట్ వాల్వ్ ద్వారా ఉదరకోశం నుంచి ఆహారం కొద్ది కొద్దిగా చిన్నప్రేగులోకి చేరుతుంది. ముందుగా కార్బోహైడ్రేట్స్ వెళ్లిపోతాయి. కొవ్వులు ప్రోటీన్లు ఉదరంలో వాటి కంటే కొద్దిగా ఎక్కువ సమయం ఉండి ఆ తర్వాత వెళ్తాయి. చిన్నప్రేగు చుట్టలు చుట్టుకుని 15 - 20 అడుగులు ఉంటుంది. ఇది మన శరీరంలో అతి పెద్ద జీర్ణ అవయవం. ఇక్కడే ఎన్నో గంటలపాటు జీర్ణక్రియ జరుగుతుంది. దేహకణాలు నేరుగా స్వీకరించడానికి ఆహారాన్ని ఇది సిద్ధం చేస్తుంది. సగం సగం ద్రవస్థితీలో ఉండే పదార్థం ఇందులోకి చేరుతుంది. అప్పటికే ఆహారం పిండిపదార్థాలుగా, మాంసకృత్తులుగా, విడగొట్టబడి ఉంటుంది. అయినా అవి భారీ అణువుల రూపంలో ఉంటాయి. కొవ్వులు అసలు జీర్ణమే కావు. పిండిపదార్థాలు, ప్రోటీన్ల భారీ అణువులను చిన్న ప్రేగు సూక్ష్మ అణువులుగా మార్చుతుంది. ఈ రసాయనిక సూక్ష్మ అణువులు చిన్నపేగుల గోడల ద్వారా నేరుగా రక్తంలోకి ప్రవేశించిగలవు. దీన్ని రసాయనిక జీర్ణక్రియ అనవచ్చు. కొవ్వులు పూర్తిగా ఇక్కడే జీర్ణమవుతాయి. నూనెలు, మాంసాలు, పాలల్లోని ఫ్యాట్స్ ఫ్యాటియాసిడ్స్ గా మారుతాయి.
చిన్న ప్రేగులో పూర్తిస్థాయి పోషకాల తయారీ కోసం ఆహారపుముద్ద మీదకు మరింత శక్తిదాయకమైన గాఢమైన ద్రవాలు స్ప్రే అవుతాయి. పేగుకు అనుబంధంగా ఉండే పింక్ కలర్ “ప్రాంక్రియాస్” లివర్(కాలేయం) వీటిని సరఫరా చేస్తాయి. ఉదరకోశం నుంచి వచ్చిన పదార్థాలలో మిగిలి ఉండే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని “ప్రాంక్రియాస్” నుంచి స్రవించే అల్కలైన్ క్షారాలు తటస్థికరిస్తాయి. దీనిలో ఎంజైములు కూడా ఉంటాయి. కాలేయంలో ఉత్పత్తి అయ్యే “పైత్యరసం” డిటర్జెంట్ల తరహాలో పనిచేసి ఫ్యాట్స్ ను విచ్ఛిన్నం చేస్తుంది. విచ్ఛిన్నమైన కొవ్వులను ఎంజైములు సూక్ష్మ అణువులుగా మార్చుతాయి. ఇలా మూడు ప్రధాన రకాల పోషక పదార్థాలు దేహ కణాలు నేరుగా వినియోగించుకునే స్థాయికి విభజించబడతాయి. వీటన్నిటిని చిన్న పేగు గోడల్లో ఉండే చూపుడు వేళ్ళ మాదిరి విల్లస్లు(విల్లి) దేహంలోకి పంపిస్తాయి. ప్రతి విల్లస్ కణం కొన భాగంలో సూక్ష్మ రక్తనాళాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ సూక్ష్మ అణువులు వీటి ద్వారా రక్త ప్రవాహంలోకి ఫిల్టర్ అవుతాయి. చిన్న పేగులో మూడోవంతు ప్రయాణం పూర్తి కావడంతోనే చాలావరకు పోషక సూక్ష్మ అణువులు రక్తంలోకి వెళ్తాయి. మృతకణాలు, జీర్ణం కాలేని సెల్యులోజ్ పదార్థాలు పెద్ద పేగులోకి వెళ్తాయి.
పెద్దపేగు నాళం 5 అడుగుల పొడవే ఉన్నా దాని వ్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మిగిలిపోయిన పోషకాలను సంగ్రహించటం, వ్యర్థాలను విడుదలకు సిద్ధం చేయటం దాని పనులు. ఇక్కడ బ్యాక్టీరియాలు రంగంలోకి దిగుతాయి. వ్యర్థాల మీద పనిచేసి, మిగిలిపోయిన కొన్ని పదార్థాలను జీర్ణం చేస్తాయి. కొన్ని విటమిన్లు సైతం వీటివల్ల తయారవుతాయి. పెద్దపేగులోని “కోలన్” భాగం వ్యర్థాల్లోని నీటిని పీల్చి వేసుకుంటుంది. దీనివల్ల అవి గట్టిపడి విసర్జించడానికి సిద్ధమవుతాయి. మనం తిన్న ఆహారం ఇలా జీర్ణమై రక్త ప్రవాహంలో కలిసిపోవడానికి మొత్తం 24 గంటల వరకు పడుతుంది.
Source : Discovery Magazine - 2006

గమనిక :
  • మాకు మీ సలహాలు – సూచనలు అవసరం.
  • పై సమాచారం వలన మీకు ఏవైనా ఇబ్బందులు/ నష్టాలు జరిగితే మేము బాధ్యులము కాదు.
  • మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము.


దృవిత సైన్స్ ను Follow అవ్వండి
మరిన్ని వివరాల కోసం DruvithaScience చూడండి

Comments