What Will Happen If Insects Disappeared On Earth In Telugu | Disappeared Insects | Druvitha Science

Druvitha Science | DruvithaScience

సాధారణంగా మనకు ఏదైనా కీటకం (పురుగు) కనిపిస్తే దాన్ని చూసి కొందరు భయపడడం లేదా మరికొందరు వాటిని తీసివేస్తారు. ఇంత వరకు బాగానే ఉంటుంది. కానీ కొందరు వాటిని (కీటకాలు) చూసిన వెంటనే కష్టపడి కాళ్ళతో తొక్కడం లేదా చేతులతో నలిపివేసి చంపేస్తారు. ఇదే క్రమంగా జరుగుతూ పోతే రోజు రోజుకి పెద్ద సమస్యగా మారుతుంది.
కీటకాలను చంపడం వలన సమస్యలు ఎందుకోస్తాయి అని అనుకుంటున్నారా? అవును వస్తాయి!
ఈ భూమిపై మానవుని మనుగడ కొనసాగాలంటే కీటకాల ప్రాముఖ్యత చాలా ఉంది. మనకు ఆహారం 50 – 90 శాతం కీటకాల వలన వస్తుంది అని మీకు తెలుసా? ఇది చాల మందికి తెలియదు కాని ఇదే నిజం!
ఇంత ప్రాముఖ్యత కలిగిన కీటకాలు నశిస్తే మానవజాతి తో పాటు అనేక రకాల జీవులు పెద్ద ప్రమాదంలో పడతాయి.
50 సంవత్సరాల లోపు భూమిపై అన్ని ప్రాణులు అంతరించిపోతాయి.

కీటకాలు నాశనమైతే ఏమవుతుంది?

వంట గదిలో బొద్దింకల బాధ, ఈగల బాధ తగ్గుతుంది. అలాగే దోమలు లేకపోవడం వలన వాటి నుంచి వచ్చే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు సంక్రమించవు. ఇంట్లో అక్కడక్కడ కందిరీగల గూళ్ళు కనిపించవు వాటికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ కీటకాల నుంచి వచ్చే ఇతర రోగాల బారిన పడటం జరగదు.

వ్యవసాయ రంగంలో రైతు ఖర్చు చేసి పురుగుల మందులు కొనాల్సిన అవసరం ఉండదు అలాగే వాళ్లకి అప్పుల బాధలు కూడా తగ్గుతాయి. ఇలా జరిగితే చాలా బాగుంటుందని అనుకుంటున్నారా? అవును చాలా బాగుంటుంది కానీ లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోవడం జరుగుతుంది.

ఇదేంటి కీటకాలు అంతరించిపోతే మనుషులు చనిపోతారా? తినడానికి తిండి ఉంది కదా వాటి తో పనేంటి? వాటితో ఎక్కువ పని ఉంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం అధిక శాతం మొక్కల నుండి  వస్తుంది అని మనకు తెలుసు కదా.
మొక్కలు పువ్వులు ద్వారా కాయలు మరియు పండ్లుగా మారటానికి ఈ కీటకాలు అవసరం లేదంటే పూసిన పువ్వు రాలిపోతుంది. అది కాయగా మారదు పండుగ మనకు దక్కదు. కాస్త ఆలోచిస్తే పరాగసంపర్కం అనే ప్రక్రియ గుర్తొస్తుంది. అదేనండి ఒక పుష్పంలోని పరాగరేణువులు వేరొక పుష్పంలోని కీలాగ్రము చేరితే దానిని పరాగసంపర్కం అంటారు. ఈ పరాగసంపర్కం జరగాలంటే కీటకాలు ఎంతో అవసరం. 

ఒక పుష్పంలోని పుప్పొడి రేణువులను  (పరాగరేణువులు) కీటకాలు వాటి కాళ్ళ ద్వారా మోసుకోనిపోతాయి అదే సమయంలో వేరొక్క మొక్కపై వాలినప్పుడు వాటి కాళ్ళకు అంటుకున్న పుప్పొడి రేణువులు ఈ మొక్క పుష్పం పై పడతాయి తద్వారా పరాగసంపర్కం జరుగుతుంది. దీని ఫలితంగా అండాలు విత్తనాలుగా అండాశయం ఫలంగా మారి మనకు తినడానికి ఉపయోగపడుతుంది. ఈ విధానం వలన మనం తినే ఆహారం అంటే గోధుమలు, వరి, జొన్న, మొక్కజొన్న, కూరగాయలు మరియు వివిధ రకాల పండ్లు లభిస్తున్నాయి. పరాగసంపర్కం జరగకపోతే ఆహారోత్పత్తి తగ్గుతుంది.
Druvitha Science | DruvithaScience

ఈ కీటకాలు అంతరించిపోతే కేవలం మానవులకు మాత్రమే కాదు ఇతర జంతువులు, పక్షులు మొదలైన జీవులు కుడా అంతరించిపోతాయి. ఇది ఆహారపు గొలుసుపై  ప్రభావం చూపుతుంది. ఎందుకంటే  తినడానికి తిండి పరాగసంపర్కం ద్వారా లభిస్తుంది.

ఒకసారి ఆహారపు గొలుసు పరిశీలిస్తే మొక్కలను తినే జంతువులు అంటే జింకలు, ఏనుగులు, మేకలు,గొర్రెలు, ఆవులు, గేదెలు ఇలా మొదలైన జంతువులు ఉన్నాయి. వీటినే మనం శాఖాహార జీవులు అంటాం. ఈ శాఖాహార జీవులను తినే పులి, సింహం, చిరుత పులి వంటి జంతువులున్నాయి. వీటిని మాంసాహార జీవులు అని అంటాం.
ఇక అన్నింటిని తినే అతి తెలివైన జంతువు మానవుడు. అందుకే సర్వభక్షకుడు అని అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక జీవి ఇంకొక జీవిపై ఎల్లప్పుడు ఆధారపడి ఉంటుంది.

మొక్కలు పరాగసంపర్కం జరిపి ఆహారాన్ని తయారు చేయకలేపోయినా లేదా నశించిపోయినా ఏమౌతుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ మనం కేవలం కీటకాల ప్రాముఖ్యత గురించే మాత్రమే మాట్లాడుకున్నాం. ఈ విధంగా మిగతా జీవుల యొక్క ప్రాముఖ్యత కూడా అధికంగా ఉంటుంది.
ఇది అర్థం చేసుకుని వాటిని రక్షిస్తే ప్రతి జీవికి ఎంతో మేలు జరుగుతుంది.
మీకు తెలుసా?
కీటకాలు లేకపోతే వృక్ష జంతు కళేబరాలు కుళ్ళిపోవు అవి అలాగే ఉండడం వలన హానికర బ్యాక్టీరియా, వైరస్లు పుట్టుకొస్తాయి. దీని వలన అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తాయి.

కీటకాలు నాశనం కావడానికి కారణాలు

ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉపయోగించే కీటక నాశునులు, క్రిమిసంహారక మందుల ద్వారానే కీటకాలు నశించడం జరుగుతుంది. ఇక్కడ పంట దిగుబడి రావాలని, పంటకు చీడ పురుగు పట్టిందని కావాల్సిన మోతాదు కంటే అధికంగా వినియోగించడం ద్వారా మరియు ఒక రకమైన చీడపురుగుల కోసం ఇతర వాటికి హాని కలిగించడం కీటకాలు నశించడం జరుగుతుంది.
ఉదాహరణకి మనం ఒకప్పుడు తేనే పట్టును, తేనెటీగలను ఎక్కడబడితే అక్కడ చూసేవాళ్ళం ఇప్పుడు అవి కనిపించడం లేదు ఇలా ఎన్నో రకాల జీవులు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. కొన్ని అంతరించిపోయాయి. అలాగే భూతాపం. వాతావరణంలో మార్పులు, అడవులు నశించడం, భూకంపాలు, వరదలు మరియు తుఫానులు వలన కీటకాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చివరికి వీటన్నిటికీ కారణమైన మానవుడి మనుగడకు రోజు రోజుకి ముప్పు పెరుగుతునే ఉంది.

సూచన:
ఇంట్లో ఎక్కడైనా చిన్న చిన్న కీటకాలు (పురుగులు) కనిపిస్తే చీపురుతో ఊడ్చి బయట వేయండి ఇలా చేస్తే ఒక జీవినే కాదు ఒక జాతినే కాపాడిన వాళ్ళం అవుతాము. చేస్తారని ఆశిస్తూ మీ దృవిత సైన్స్.

గమనిక:
పరాగసంపర్కం అనే ప్రక్రియ జంతువులు, పక్షులు, మనుషులు, గాలి మరియు నీటి ద్వారా కూడా జరుగుతుంది కానీ అధికంగా కీటకాల ద్వారా నే జరుగుతుంది. కేవలం కీటకాల ద్వారా మాత్రమే జరగదు.

వీక్షకులకు విజ్ఞప్తి :
  • సైన్స్ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఉంటే రాసి పంపండి. మీ పేరుతో ప్రచురణ చేస్తాం.
  • మేము ప్రచురుణ చేసే వాటిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము.


మరిన్ని వివరాల కోసం Druvitha Science ను చూడండి

Comments

Post a Comment

Feel Free To Leave A Comment